కోడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం... బోనస్ ఏ రకం దాన్యానికో తెలుసా?

కోడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రూ. 500 బోనస్ ఏ రకం దాన్యానికో తెలుసా?


ప్రభుత్వపీఠం, రఘునాథపల్లి, అక్టోబర్ 29: మండలంలోని కోడూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు 21 రోజుల్లో బిల్లులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. నిబంధనల ప్రకారం తేమ 17 శాతానికి మించకూడదని రైతులకు సూచించారు. ధాన్యం క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర ఏ-గ్రేడ్‌ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300గా ఉందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీసీ సంపత్‌ ఎల్లస్వామి, మాజీ ఎంపీటీసీ గొరిగె భాస్కర్‌, జోగు గట్టయ్య, మడికంటి కర్ణాకర్‌, పూజారి మదన్‌మోహన్‌, శాగంటి అంజయ్య, సానిక చంద్రయ్య, గొడిశాల నర్సయ్య, శాగంటి సోమయ్య, సీఏ లావణ్య, హమాలీ సంఘం సభ్యులు కర్రె రాములు, కొలుపుల వెంకన్న, మల్లేశ్‌, కుమార్‌, మహిళా సంఘం సభ్యులు సట్ల రేణుక, సట్ల యాకమ్మ, కందాల అండాలు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది -రైతులు


మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన కేంద్రాలు ఆలస్యం కావడంతో ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని రైతులు వాపోయారు. పంట పొలాల వద్దకే వ్యాపారులు వస్తుండటంతో ధాన్యాన్ని అమ్మేస్తున్నామని చెప్పారు. క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర ఏ-గ్రేడ్‌ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300గా ఉంది. 

అయితే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబోసేందుకు వర్షాల భయంతో వ్యాపారులకు విక్రయించాల్సి వస్తుందని చెప్పారు. మద్దతు ధర కంటే తక్కువకే ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు క్వింటాకు రూ.1,900 నుంచి రూ.2,005 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఆలస్యం వల్ల ప్రభుత్వ మద్దతు ధరను కోల్పోతున్నామని రైతులు చెప్పారు. 

రూ.500 బోనస్‌


వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా సన్న వడ్లకు రూ.500 బోనస్ వర్తింపజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ పెద్దలు పలుమార్లు వెల్లడించారు. అయితే ఏ రకం ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తారనే విషయంపై రైతుల్లో సందేహాలు నెలకొన్నాయి. ప్రతి క్వింటాల్‌ ధాన్యానికి రూ. 500 బోనస్‌ చెల్లిస్తామని చెప్పగా అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించారు

బోనస్‌ ఇవ్వడానికి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వరి ధాన్యం సన్నాల్లోని 33 రకాలకు రూ. 500 బోనస్ వర్తింపజేశారు. వరి ధాన్యం గింజ పొడువు, వెడల్పు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అనేది తెలుసుకోనున్నారు. అందుకోసం ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద మైక్రో మీటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గింజ పొడవు 6 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కాకుండా ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ధాన్యం తేమ 17 శాతానికి మించనప్పుడు మాత్రమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి బోనస్ వర్తింపజేయనున్నారు.

రూ.500 బోనస్ వర్తించే రకాలు:

వరంగల్‌ సాంబ(డబ్ల్యుజీఎల్‌ 14)
వరంగల్‌ సన్నాలు (డబ్ల్యుజీఎల్‌32100)
జగిత్యాల్‌ మసూరి (జేజీఎల్‌11470)
సిద్ధి(డబ్ల్యుజీఎల్‌44)
కంపసాగర్‌ వరి-1 (కేపీఎస్‌ 2874)
సాంబ మసూరి ( బీపీటీ 5204)
జగిత్యాల్‌ వరి- 3(జేజీఎల్‌ 27356)
జగిత్యాల్‌ వరి- 2(జేజీఎల్‌ 28545)
పొలాస ప్రభ (జేజీఎల్‌ 384)
వరంగల్‌ వరి- 2 (డబ్ల్యుజీఎల్‌ 962)
ఎంటీయూ 1271
రాజేంద్రనగర్‌ వరి - 4 (ఆర్‌ఎన్‌ఆర్‌ 21278)
కూనరం వరి- 1 (కేఎన్‌ఎం 733)
జగిత్యాల సన్నాలు (జేజీఎల్‌ 1798)
కృష్ణ (ఆర్‌ఎన్‌ఆర్‌ 2458)
మానేరు సోనా (జేజీల్‌ 3828)
తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)
వరంగల్‌ వరి - 1119
కూనరం వరి- 2 (కేఎన్‌ఎం 1638)
జగిత్యాల సాంబ (జేజీఎల్‌ 3844)
కరీంనగర్‌ సాంబ (జేజీఎల్‌ 3855)
అంజన (జేజీఎల్‌ 11118)
సోమ్‌నాథ్‌ (డబ్ల్యుజీఎల్‌ 347)
ఆన్‌ఆర్‌ఆర్‌ 31479(పీఆర్సీ)
కేపీఎస్‌ 6251 (పీఆర్సీ)
జేజీఎల్‌ 33124 (పీఆర్సీ)
నెల్లూరు మసూరి (ఎన్‌ఎల్‌ఆర్‌ 34449)
ప్రత్యుమ్న (జేజీఎల్‌ 17004)
సుగంధ సాంబ (ఆర్‌ఎన్‌ఆర్‌ 2465)
శోభిని (ఆర్‌ఎన్‌ఆర్‌ 2354)
హెచ్‌ఎంటీ సోనా
మార్టేరు మసూరి (ఎంటీయూ 1262)
మార్టేరు సాంబ (ఎంటీయూ 1224)







Comments