సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం
ప్రజలు సహకరించాలని మంత్రి పొన్నం పిలుపు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి లాంచనంగా ప్రారంభించారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్‌లను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని.. 150 ఇండ్లకు ఒక ఎన్యుమరెటర్ సర్వే వివరాలు సేకరిస్తారని చెప్పారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటించిన అనంతరం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వెళ్లి కుటుంబ వివరాలు నమోదు చేసుకుంటారని మంత్రి చెప్పారు.
అత్యంత సీక్రెట్ గా సమాచారం..
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా కులాలవారీగా.. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి స్థితిగతులపై సమాచారాన్ని ప్రభుత్వం సేకరించనుంది . దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నది. అయితే, అందుకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో ప్రకటించారు. అందులో భాగంగానే.. రాష్ట్ర పౌరులకు సంబంధించి కులాలవారీగా సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.