ఒక్కరోజులోనే రూ.1,300 పెరుగుదల
రూ. లక్షకు చేరిన కిలో వెండ ధర
దేశంలో బంగారం ధరలు రోజురోజుకు ఆకాశానికి దూసుకెళుతున్నాయి. శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి ఒక్కరోజులోనే రూ.1,300 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.89 వేలు ను దాటింది. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా పది గ్రాముల బంగారం రూ.89,400కు చేరుకుంది. ఫిబ్రవరి నెల తొలి వారంలో రూ.85 వేలు పలికిన తులం బంగారం ధర కేవలం పది రోజుల్లోనే రూ.4 వేలు పెరిగింది.
ఇక హైదరాబాద్‌లోనూ 24 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర రూ.87,160 పలుకుతుంది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) బంగారం ధర రూ.79,900 ఉన్నది. రాజధానిలో కిలో వెండి ధర రూ.2,000 పెరిగి, లక్ష రూపాయలకు చేరుకుంది. నగల వ్యాపారులతోపాటు నాణేల తయారీదారులు, పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు అమాంతం పెరిగినట్లు మార్కెట్ వర్గాల టాక్. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ 2,929.79 డాలర్లు పలుకుతున్నది.
పుత్తడి ధరలు ఇలాగే అడ్డూ అదుపు లేకుండా దూసుకెళితే త్వరలోనే తులం ధర రూ.లక్షకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బంగారంపై పెట్టుబడి పెట్టే ఆలోచన ఉన్నవారికి ఇది మంచి అవకాశం అని నిపుణులు పేర్కొంటున్నారు.