బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు సేఫ్ ల్యాండింగ్
ప్రపంచమంతా ఊపిరి బిగపట్టుకుని ఎదురు చూసిన ఉత్కంఠ వీడింది. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్(Sunita Williams), విల్మోర్ బుచ్ ఎట్టకేలకు భూమి మీదికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కోసం ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి ఎదురు చూసింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షం నుంచి అవని మీద దింపింది.
సునీత, విల్మోర్‌లతోపాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్‌ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో భూమి మీదికి వచ్చేశారు. కేవలం 8 రోజుల యాత్ర కోసం 2024 జూన్ 5న ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీత, విల్మోర్ దాదాపు 9 నెలలు అక్కడే చిక్కుకుపోయారు.
ఐఎస్‌ఎస్ నుంచి భూమికి తిరిగి బయలుదేరే ముందు అక్కడి వ్యోమగాములకు సునీత, విల్మోర్, నిక్ హేగ్, గోర్బునోవ్ వీడ్కోలు చెప్పారు. అంతా కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఆ సమయంలో ఐఎస్‌ఎస్ సందడిగా మారింది. అనంతరం సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకుని, ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమివైపు బయలుదేరారు.
సాగర జలాలకు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని రెండు డ్రోగ్‌చూట్లు ఓపెన్ అయ్యాయి. ఆ సమయంలో వ్యోమనౌక గంటకు 560 కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొచ్చింది. డ్రోగ్‌చూట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూడ్రాగన్ వేగం క్రమంగా గంటకు 190 కిలోమీటర్ల వేగానికి తగ్గిపోయింది. సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు ఓపెన్ అయ్యాయి. డ్రోగ్‌చూట్లు, పారాచూట్లు క్రూ డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్లెం వేయడంతో కమాండ్ సెంటర్‌లో చప్పట్లు మార్మోగాయి. ఆపై ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా ల్యాండ్ అయింది.
నిమిషాల్లోనే స్పీడ్‌బోట్లలో రికవరీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వ్యోమనౌకను మేగన్ నౌకపైకి చేర్చారు. ఆపై- లోపల ఉన్న నలుగురు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్ హేగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీతా విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత.. ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు.
వీడియో చూడండి:
Watch Dragon and Crew-9 return to Earth → https://t.co/ZZEmGU8Aar https://t.co/aqY6RNsEfK
— SpaceX (@SpaceX) March 18, 2025
Drogue and main parachutes have deployed pic.twitter.com/X0wiXqFaPt
— SpaceX (@SpaceX) March 18, 2025